మా గురించి

కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవెంకటేశ్వరుడుగా అవతరించాడని కథనం

హిందూ దేవాలయాలు:

భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా కాలాలలో అనేక మంది పాలకులు, అనేక మంది భక్తులు దేవాలయాలు నిర్మించారు.

ప్రధానంగా, భారతీయ ఆలయ నిర్మాణాన్ని మూడు విస్తృత రకాలుగా వర్గీకరించారు, అవి నగరా లేదా నార్తర్న్ స్టైల్, వెసర లేదా మిశ్రమ శైలి మరియు ద్రావిడ- ఇది దక్షిణ శైలి.

ఆలయాలు అయిదు విధాలు

స్వయంవ్యక్త స్థలాలు: భగవంతుడే స్వయంగా అవతరించినవి
దివ్య స్థలాలు : దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి
సిద్ధ స్థలాలు: మహర్షులు, తపస్సు చేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి
పౌరాణ స్థలాలు : పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి
మానుష స్థలాలు : రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడినవి

చరిత్ర: భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడిన కోవకు చెందిన శ్రీకళ్యాణవెంకటేశ్వరస్వామి వారి దేవాలయము శంఖుస్థాపన ది: 19-04-2018 న ఇన్వెంటా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీమాన్ చెరుకూరి సత్యనారాయణ, రాజ్యలక్ష్మి దంపతుల కర కమలములతో సుముహూర్తమాన నిర్వహించగా, అనతి కాలములోనే సర్వాంగ సుందరముగా శ్రీ కళ్యాణవెంకటేశ్వరస్వామి, శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివార్ల దేవాలయములను శరవణ శిల్పశాల, మామలాపురం, తమిళనాడు శిల్పి బ్రహ్మశ్రీ పద్మనాభన్ గారి కళానైపుణ్యంతో నిర్మింపచేసినారు.

ది: 05-02-2020 శ్రీ వికారి నామ సంవత్సర, మాఘ శుద్ధ ఏకాదశి, మృగశిర నక్షత్రయుక్త మీనలగ్న పుష్కరాంశమందు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేదవిద్యాలయ అధ్యాపకులు, వారి శిష్యబృందం మరియు శ్రీమాన్ పరాంకుశం అచ్యుతాచార్యుల వారి కర కమలములతో అందచేసిన అనుష్టాన యంత్రములను వినియోగించి స్వామివారి ధృవమూర్తిని మరియు ఉత్సవమూర్తులను, శ్రీగణపతి, శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ధ్రువమూర్తులను శ్రీమాన్ చెరుకూరి సత్యనారాయణ, రాజ్యలక్ష్మి దంపతుల చేతులమీదుగా వారి కుటుంబ సభ్యులు కలసి మేళతాళాలతో, వేదమంత్రోఛ్చారణలతో మహాప్రతిష్ఠగావించినారు. ఆనాటినుండి ప్రతిరోజూ శ్రీవైఖానస ఆగమ సంప్రదాయాలతో స్వామివార్ల నిత్యఅర్చన, నిత్యధూపదీప నైవేద్యములు శ్రీ చెరుకూరి సత్యనారాయణ, రాజ్యలక్ష్మి వారి ఆర్థికసహకారముతో నిర్వహింపబడుచున్నవి.