మా గురించి

శ్రీరామావతారంలో రాముడికి బంటుగా సీతాన్వేషణ సాగించిన ధీశాలి బుద్ధిశాలి
హనుమంతుడు. కార్యశూరునికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
హనుమంతుని ఉపాసన జ్ఞానానికి ధైర్యానికి మంచి సాధన. హనుమంతుని
మంత్రం సాధన వలన మనలో అద్వితీయమైన ధైర్య శక్తి వాక్ పటిమ లభిస్తాయి.
హనుమంతుడు క్షేత్రంలో ఉండటం వల్ల ఆ క్షేత్రం జ్ఞానానికి ఆలవాలమై ధర్మానికి
నిలయమై ఉంటుంది. కాకరవాయి క్షేత్రంలోని హనుమంతుడు ప్రసన్నవదనుడు.
అసంఖ్యాక మంత్రం సాధనాలకు మూల మూర్తిగా ఈ క్షేత్రంలో కొలువుదీరి
భక్తులకు మనశ్శాంతిని అందిస్తున్నాడు. హనుమంతుల వారి వాహనంగా ఒంటె
ఇక్కడ స్వామి వారికి ఎదురుగా ఉంటుంది. ఒంటె లోని గొప్పదనం ఎడారిలో
సైతం ఓపికగా బ్రతకగలగడం. అందుకే ఎంత కష్టాల్లో ఉన్నా ఒంటెలా ఓపికతో
వాటిని ఎదుర్కోవాలనే అర్ధానికి చిహ్నంగా ఒంటె వాహనాన్ని ప్రతిష్ట చేశారు.
కాశీ విశ్వేశ్వర స్వామి – నందీశ్వర స్వామి
జగత్తు అంతా శివమయం. కాశ్మీరం మొదలు కన్యాకుమారి వరకు
పరమేశ్వరుడు ఈ దేశంలో కొలువున్నాడు. అభిషేక ప్రియుడైన శివుడు
కాకరవాయి క్షేత్రంలో కాశీ విశ్వేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
నిత్యం నందీశ్వర స్వామి శివునికి అభిముఖంగా ఉంటూ ధర్మ మార్గంలో బ్రతికే
విధానాన్ని అందిస్తున్నాడు. స్వామి కరుణా కటాక్షాలను సర్వులకి అందాలన్న
సదుద్దేశంతో శివున్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు.
జీవధ్వజం – విమానశిఖరం
మానవులకి జీవం, కళలను ఆలయాలే అందిస్తాయి. ఆలయాల ముందు
జీవధ్వజం మానలకి నిండైన మూర్తిమత్వం ఎలా సాధించాలో నేర్పిస్తుంది. జీవాన్ని

నిలబెట్టడానికి కావాల్సిన ధాతువులను ఈ జీవధ్వజంలో నిక్షిప్తం చేస్తారు. అవి
మనకి అద్భుతమైన శక్తిని అనుగ్రహిస్తాయి. అలాగే విమానశిఖర దర్శనం విష్ణు
ఆలయాలలో అతి ముఖ్యమైనది. తిరుమలలో విమాన వేంకటేశ్వర స్వామి దర్శనం
ఎంతో ఫలవంతమైనది. పురోగమిస్తున్న ఆకాశయానానికి విమానం ఒక చిహ్నం.
అనంతమైన జ్ఞానాకాశంలో విహరించడానికి భక్తి అనే విమానాన్ని శ్రద్ధ అనే
దేహంతో అధిరోహించి సంపూర్ణ జ్ఞాన ఫలమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడిని
దర్శించాలి అని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.